బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు బుద్ధి, జ్ఞానం ఉందా? మంత్రి పొన్నం



రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, వారి మాటలు ప్రజాస్వామాన్ని పరిహాసం చేసేలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడియం, రాజాసింగ్‌ జ్యోతిష్యం చదివారా?



ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలేమిటి?


ఇలాంటివి కాంగ్రెస్‌ సర్కార్‌ ఉపేక్షించబోదు


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసింది: పొన్నం


సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 13: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, వారి మాటలు ప్రజాస్వామాన్ని పరిహాసం చేసేలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని.. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మాత్రం సభ్యసమాజం అసహ్యించుకునేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదని.. అయితే సర్కారు ఎక్కువ కాలం కొనసాగదంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లాంటి నేతలు అవివేకంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్తారని రాజసింగ్‌ మాట్లాడుతున్నారని, ఆయన ఏమైనా జ్యోతిష్యం చదివారా? అని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేతలు తొలుత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్ష సభ్యులుగా ప్రభుత్వ పరంగా ఏమైనా లోటు పాట్లు ఉంటే వాటిని ఎత్తిచూపాలని చెప్పారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం దాదాపు గంటకుపైగా పొన్నం వాకింగ్‌ చేశారు. తర్వాత పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు.


ప్రభుత్వం మారిందని, విధివిధానాలు కూడా మారాయని, విపక్షాలకు విలువ ఇవ్వడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దానిని వినియోగించకుండా రాజకీయాలు చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదన్నారు. ‘ఈట్‌ కా జవాబ్‌ పత్తర్‌ సే దేతే’. జాగ్రత్త అని హెచ్చరించారు. సీనియారిటీ ప్రకారంగా ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారని, ప్రతీసారి మతపరమైన అంశాన్ని తీసుకురావాలని చూస్తే బాగుండదంటూ బీజేపీ నేతలు ప్రమాణస్వీకారం చేయకపోవడాన్ని పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దింపేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌ పార్టీలు ఒక్కటై హంగ్‌ తీసుకవచ్చేలా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన బిడ్డలెవరూ పార్టీని వీడరని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఇకనైనా మూర్ఖపు ఆలోచనలు మానుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం సంస్థను బలోపేతం చేస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం అమలుపై మహిళలు, ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్సె క్కి ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటూ మహిళలను పలకరించారు. ఉచిత ప్రయాణం ఎలా ఉంది? ఇంకేమన్నా సౌకర్యాలు కావాలా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మీ కోసం ఉందని మీ సౌకర్యం కోసం సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులందరం కలిసి నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నామని చెప్పారు. మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow