మైసూర్ ఎంపీ ఆఫీస్ నుంచి పాస్‌లు!
న్యూఢిల్లీ, లోక్‌సభలో దాడికి పాల్పడిన వ్యక్తులకు బీజేపీ మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం నుంచి సందర్శకుల పాస్‌లు జారీ అయ్యాయి. దాడికి పక్కా ప్రణాళికతోనే సిద్ధమైనట్లు అధికారులు భావిస్తున్నారు. లోక్‌సభలో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకిన డి.మనోరంజన్ మైసూరుకు చెందిన వాడని, తరచూ ఎంపీ ఆఫీసుకు వస్తుండేవాడని అధికార వర్గాలు తెలిపాయి. విజిటర్స్ పాస్ కోసం మనోరంజన్ మూడు నెలలుగా ఎంపీ ఆఫీసును సంప్రదిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అతనితో పాటు సభలో బెంచ్‌లపై నుంచి దూకుతూ స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లిన సాగర్ శర్మను మనోరంజన్ తన స్నేహితుడని చెప్పి, పాస్ తీసుకున్నట్లు గుర్తించారు. కొత్త పార్లమెంటును చూడాలని ఉందంటూ ఎంపీ కార్యాలయ అధికారులకు చెప్పి, వీరు పాస్‌లు తీసుకున్నారు. బుధవారం సింహా తరఫున మొత్తం మూడు పాస్‌లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో మహిళకు పాస్ ఇచ్చినప్పటికీ.. ఆమె తన కుమార్తెతో కలిసి రావడం, చిన్నారి పేరు పాస్‌లో లేకపోవడంతో అనుమతించలేదని ఎంపీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
BANGLOREE:- తన కుమారుడు తప్పు చేసిఉంటే ఉరితీయాలని లోక్‌సభ చాంబర్లోకి చొరబడిన మనోరంజన్ తండ్రి దేవరాజె గౌడ అన్నారు. బుధవారం మైసూరులో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికి పార్లమెంటు దేవాలయం లాంటిదని, సభలోకి దూసుకెళ్లి వీరంగం వేయడం తప్పేనని, తన కుమారుడు తప్పు చేసినట్లేనని స్పష్టం చేశారు. అయితే మనోరంజన్ నిజాయితీపరుడని, సమాజానికి మంచి చేయాలని, త్యాగం చేయాలని ఎప్పుడూ తపనపడుతుంటాడని.. స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం వల్లే ఈ లక్షణాలు అలవడ్డాయని తెలిపారు. ‘అతడు మంచి పని చేస్తే సరే. ఏదైనా తప్పుడు చేస్తే మాత్రం నా కొడుకే కాదు.. ఉరి తీయొచ్చు’ అని దేవరాజె అన్నారు.
