HYD: పోటీకి సై అంటున్న ‘పారిజాత’ వర్గం.. కేఎల్ఆర్‏ను సమర్థించేదిలేదు

మహేశ్వరం(Maheshwaram)లో కాంగ్రెస్‌ పరిస్థితి గందరగోళంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
చివరిదాకా టికెట్‌ కోసం ప్రయత్నించిన బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాతారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేయగా.. బీ ఫామ్‌ మాత్రం కె. లక్ష్మారెడ్డి(కేఎల్లార్‌)కి ఇవ్వడం గమనార్హం. నామినేషన్‌ దాఖలు చేసిన పారిజాతారెడ్డి సైతం పోటీలో నిలిచేందుకే ఆసక్తి చూపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ఆమె వర్గం నాయకులు, కార్యకర్తలు సైతం కేఎల్లార్‌కు టికెట్‌ ఇవ్వడంపై ఇంకా ఆగ్రహంతోనే ఊగిపోతున్నారు. ఏడాదిన్నర నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి పార్టీని పటిష్టం చేసిన పారిజాతారెడ్డిని కాదని కేఎల్లార్‌కు టిక్కెట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీలో ఉండాల్సిందే..! బీ ఫామ్‌ వస్తుందనే నమ్మకంతోనే మొదటిరోజే నామినేషన్‌ వేశామని, ఇప్పుడు ఆ దారి కూడా మూసుకుపోవడంతో ఏం చేయాలో తోచడం లేదని పారిజాతారెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, ఆమెకు మద్ధతుగా నిలబడిన నాయకులు, కార్యకర్తలు మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీలో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నట్టు తెలిసింది. టికెట్‌ ఇస్తామని చివరి నిమిషందాకా నమ్మించి గొంతు కోసిన పెద్దలకు తమ బలం ఏంటో చూపించే తరుణం ఇదేనని వారు పేర్కొంటున్నట్టు తెలిసింది. రెండ్రోజుల్లో తుది నిర్ణయం నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నందున మరోసారి కార్యకర్తల సమావేశం నిర్వహించి, మెజారిటీ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని పారిజాతారెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. కార్యకర్తల నుంచి ఒత్తిడి ఇలాగే ఉంటే పోటీలో ఉండక తప్పదేమో అని ఆమె ముఖ్య నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే.. పారిజాతారెడ్డికి టికెట్‌ రాకపోవడంతో మొన్నటిదాకా ఆమెకు మద్దతు తెలిపిన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తల్లో అనేకమంది బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల్లోకి వెళ్తున్నట్టు సమాచారం.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow