Telangana: ఓరి తిరుమలరావు..! మాములు కంత్రీవి కాదు నువ్వు.. సర్వేయర్ హత్య కేసులో కొత్త విషయాలు
జోగులాంబ గద్వాల్‌లో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఒక్కొక్కటిగా మిస్టరీలు బహిర్గతమవుతున్నాయి. వాయిస్ చేంజర్‌తో హత్య కుట్రను అమలు చేసిన తిరుమల్–ఐశ్వర్యల పై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. “నన్నెందుకు చంపుతున్నారన్నా...” అంటూ వేడుకున్నా తేజేశ్వర్‌ను సుఫారీ గ్యాంగ్ అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు వెల్లడైంది.
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితులు దొరికారు. వారిని రిమాండ్‌కు తరలించారు. కానీ హత్య కుట్రలో అనేక మిస్టరీలు, చిక్కుముడులు అలానే ఉండిపోయాయి. అయితే నిందితుల కస్టోడియల్ విచారణలో అనేక ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీసులు. ఈ క్రమంలో మరోసారి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాహ్యప్రపంచానికి తెలియని అనేక అంశాలు ఒక్కోక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. అంతేకాదు… అన్న నన్నెందుకు చంపుతున్నారన్నా… నేనేం తప్పు చేశాను అని వేడుకున్నా.. జాలి లేకుండా సుఫారీ గ్యాంగ్ తేజేశ్వర్‌ను అంతమొందిచింది.
గత నెల 17న సంచలనం సృష్టించిన జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆది నుంచి అనేక మలుపులు, మిస్టరీలతో సాగిన ఈ కేసులో కట్టుకున్న భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమల్ రావులే సుఫారీ గ్యాంగ్ తో హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన నిందితులందరీని అరెస్టు చేసి ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. అయితే తేజేశ్వర్ హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీసులు కుట్ర మొత్తం చేధించే పనిలో పడ్డారు. తేజేశ్వర్ హత్య కేసులో నిందితుల కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ అనంతరం A1 తిరుమల రావు, A3 నాగేష్, A4 పరశురామ్, A5 రాజు లను నాలుగు రోజుల పాటు కస్టడీలో తీసుకొని పోలీసులు విచారించారు. తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి తిరుమల్ రావు, ప్రియురాలు ఐశ్వర్య కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తాను అనుభవించిన మహిళ ఇంకేవరికి దక్కకూడదన్న ఉద్దేశ్యంతోనే తేజేశ్వర్‌ను తిరుమల్ రావు హత్య చేయించినట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం పెళ్లి నాటి నుంచి పక్కా ప్రణాళికతోనే హత్య స్కెచ్‌ను అమలు చేశారు నిందితులు. పెళ్లైన నెల రోజుల వ్యవధిలోనే ఐశ్వర్య భర్త తేజేశ్వర్‌ను హత్య చేయాలని కుట్రకు తెర లేపారు. ఇందుకోసం నెల రోజుల పాటు తేజేశ్వర్‌తో శారీరకంగా కలవకుండా ఉండాలని ఐశ్వర్యను ఒప్పించాడు తిరుమల్ రావు. అయితే మే 17న తేజేశ్వర్, ఐశ్వర్య వివాహం జరగ్గా… జూన్ 13వ తేదీనే హత్య చేయాలని ప్లాన్ అమలు చేశారు. సుఫారీ గ్యాంగ్ తేజేశ్వర్ కు ఫోన్ చేసి భూములు ఉన్నాయి సర్వే చేయాలని ఫోన్ చేశారు. అయితే తేజేశ్వర్ తన మిత్రుడు కిశోర్‌తో రావడంతో 13వ తేదీన హత్య ప్లాన్ విఫలమైంది. దీంతో జూన్ 17న ఎట్టకేలకు తేజేశ్వర్‌ను ఒంటరిగా రప్పించి… కిడ్నాప్ చేసి అనంతరం కారులోనే హత్య చేశారు. అన్నా… నన్నేందుకు చంపుతున్నారు… నేనేం తప్పు చేశానని వేడుకున్నా.. నిందితులు నాగేశ్, రాజు, పరుశరామ్ లు కనికరించలేదు… అత్యంత కిరాతకంగా తేజేశ్వర్ గొంతుకోసి హత్య చేశారు.
వాయిస్ చేంజర్ డివైస్‌తో మహిళ గొంతులో మాటలు:
ఇక ఐశ్వర్యకు పెళ్లైనా.. ప్రతిరోజు నిత్యం ఫోన్‌లో టచ్ లోనే ఉన్నాడు తిరుమల్ రావు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తేజేశ్వర్, అత్త, మామలకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. వాయిస్ చేంజర్ డివైస్ ఉపయోగించి మహిళ గొంతుతో నిత్యం ఐశ్వర్యతో మాట్లాడుతూ తేజేశ్వర్ మూమెంట్, హత్య ప్లాన్‌ను అమలు చేశారు. ఈ విషయాన్ని కస్టడీలో తిరుమల్ రావు చెప్పడంతో ఆయన ఆఫీసులో వాయిస్ ఛేంజర్ డివైస్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఇక త్వరలోనే మరోసారి తిరుమల్ రావుతో పాటు ఐశ్వర్య లను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు.