ఉదయం ఎనిమిది గంటలు. అల్పాహారశాల రద్దీగా ఉంది. ఇంతలో రామారావు అక్కడికి వచ్చాడు. తనకు కావలసిన అల్పాహారం చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి రామారావు కోరిన అల్పాహారాన్ని పొట్లాలు కట్టసాగాడు.
వద్దు వద్దు' అంటూ తను తెచ్చుకున్న గిన్నెలో అల్పాహారాన్ని పెట్టించుకున్నాడు రామారావు. పొట్లాలు కట్టేవాడు విసుక్కున్నాడు.
నాలుగు రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం ఆరుగంటల సమయం. కర్రీపాయింట్ రద్దీగా ఉంది. రామారావు అక్కడికి వచ్చాడు సాంబారు అడిగాడు. వాళ్ళు క్యారీ బ్యాగ్ లో వేసి ఇవ్వబోతే వద్దని తను తెచ్చుకున్న గిన్నెలో పోయించుకున్నాడు.
బంగాళదుంప కూర కొనుక్కోవటానికి అక్కడికి వచ్చిన పక్కింటి సుబ్బారావు రామారావును గమనించాడు. రామారావును చూసి హేళనగా నవ్వుతూ 'ఊరందరిదీ ఒక దారి ఉలిపికట్టెది ఒక దారి' అన్నాడు.
' వేడివేడి సాంబారు, కూరలను క్యారీ బ్యాగ్లో వేసుకుని పట్టుకెళ్తే క్యారీ బ్యాగ్ కరిగి ఆ పదార్థం ఆహారంలో కలుస్తుంది. దాన్ని తిన్న వాళ్ళు ప్రమాదకరమైన జబ్బుల బారిన పడతారు.
అల్పాహారం, కూరలను వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకోవటం ఉత్తమం. తప్పనిసరై బయట నుండి తెచ్చుకోవాల్సివస్తే గిన్నెలనే ఉపయోగించాలి' అన్నాడు రామారావు.
'జనం అంతా వేరేదారిన పోతుంటే మీ ఒక్కరి వల్ల ఏమవుతుంది? అంతా మిమ్మల్ని వింతగా చూస్తున్నారు' అన్నాడు సుబ్బారావు.
'వందమంది నన్ను వింతగా చూసినా, ఒక్క మనిషైనా నన్ను చూసి మారితే చాలు. మార్పు మొదలైనట్టే' అన్నాడు రామారావు.
మర్నాటి నుండీ సుబ్బారావు క్యారీ బ్యాగుల స్థానంలో గిన్నెలను వాడటం మొదలెట్టాడు.
Tags
News@jcl