ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash Reddy) వర్గీయుల మధ్య ప్లెక్సీ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి (Revuri Prakash Reddy) వర్గీయుల మధ్య ప్లెక్సీ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ధర్మారంలో మంత్రి కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో రేవూరి ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు వాటిని చింపివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ అభిమాన నేత మంత్రి కొండా ఫ్లెక్సీలు చింపివేయడంపై ఆమె అభిమానులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలంతా వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారి ధర్మారం వద్ద రాస్తారోకో నిర్వహించారు.
రేవూరి ప్రకాశ్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రేవూరి తమపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. కొండా వర్గీయుల ధర్నాతో వరంగల్- నర్సంపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు మంత్రి కొండా, సీపీ అంబర్ కిషోర్ ఝా చేరుకున్నారు. తమ వర్గీయులపై కేసుకు సంబంధించిన వివరాలను సీపీని అడిగి మంత్రి కొండా సురేఖ వివరాలు తెలుసుకున్నారు.