ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు దక్కకుండా చూడండి



డబుల్ బెడ్రూం తరహా అవినీతి జరక్కుండా నిఘా పెట్టండి

మహిళా సమాఖ్యల ప్రతినిధులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదేశం

వచ్చే ఏడాది ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేస్తామని ప్రకటన



జడ్చర్ల, అక్టోబర్ 19: గ్రామాల్లో అనర్హులైన ఏ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకుండా మహిళా సమాఖ్యలు, మహిళా సంఘాల సభ్యులు చూసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. డబుల్ బెడ్రూం ఇండ్ల తరహాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఎక్కడా అవినీతి జరగకుండా నిఘా పెట్టాల్సిన బాధ్యత కూడా మహిళా సంఘాలదేనని  చెప్పారు. తన నియోజకవర్గంలోని ప్రతి మహిళకు వచ్చే ఏడాది చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన జడ్చర్ల నియోజకవర్గ స్థాయి మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఐకేపీ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న గ్రామ, వార్డు కమిటీల్లో మహిళా సంఘాలకు చెందిన సభ్యులను కూడా సభ్యులుగా నియమించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని, ఒక ఇంటి కోసం రూ.2 లక్షల దాకా బీఆర్ఎస్ నేతలు వసూలు చేసి, ఎలాంటి అలాట్మెంట్లు లేకుండానే అనర్హులను కూడా తీసుకెళ్లి ఆ ఇళ్లలో పెట్టారని, ప్రస్తుతం అలాంటి వారిని ఆ ఇండ్ల నుంచి తొలగించడం కష్టమౌతోందని తెలిపారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహిళా సంఘాలదేనని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు పూర్తిగా అర్హులకే అందాలని ఒక్క ఇల్లు కూడా అనర్హులకు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అనిరుధ్ రెడ్డి సూచించారు. తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ను కూడా మహిళా సంఘాల వారికి ఆయన అందించారు. కాగా మహిళలు అంటే తనకు ఎంతో గౌరవం అని అందుకే వచ్చే సంక్రాంతి లేదా ఉగాదికి నియోజకవర్గంలోని మహిళలు అందరికీ తాను చీరలు ఇవ్వాలని నిర్ణయించానని వెల్లడించారు. అయితే ఉచిత చీరలు అంటే నాసిరకం చీరలు కాదని, తన ఇంట్లో తన అమ్మ ఏ చీర కడతారో అదే చీరను తాను ప్రతి మహిళకూ ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. సంఘాల్లో ఉన్నా, లేకున్నా అన్ని గ్రామాల్లో ఉండే మహిళల జాబితాను తనకు తయారు చేసి ఇవ్వాలని మహిళా సమాఖ్య ప్రతినిధులను ఎమ్మెల్యే కోరారు. ప్రతి మహిళకూ చీర అందేలా చూడాలన్నారు. ఉర్కొండ మహిళా సమాఖ్య భవనం మరమ్మతులకు రూ.లక్ష తాను సొంతంగా ఇస్తానని ప్రకటించారు. మహిళా సమాఖ్యకు కొత్త భవనం కట్టుకోవడానికి 500 గజాల స్థలం కేటాయించాల్సిందిగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి కోరగా అందుకు కలెక్టర్ అంగీకారం తెలిపారు. నవాబుపేటలో ఉన్న సీతాఫలాల పల్పింగ్ యూనిట్ ను సందర్శించి అక్కడున్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జడ్చర్ల మండల మహిళా సమాఖ్య భవనం మరకమ్మత్తులకు రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అన్ని మండల మహిళా సమాఖ్యల భవనాలకు మరమ్మత్తులు చేయడంతో పాటుగా భవనాలు లేని చోట కొత్త భవనాలను నిర్మించడానికి కృషి చేస్తానని, మండలానికి కనీసం ఐదు గ్రామ సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం నుంచి, అలాగే కంపెనీల సీఎస్ఆర్ పథకం నుంచి నిధులను తీసుకొస్తానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల మహిళా సమాఖ్యల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటుగా తనకు వీలైనప్పుడల్లా మండల మహిళా సమాఖ్య సమావేశాల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఏపీఎంలు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow