గ్రామాలలో కోకొల్లలుగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు దర్శనం

 గ్రామాలలో

 కోకొల్లలుగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు దర్శనం




అక్రమ దందాలకు విచ్చలవిడిగా వినియోగం


రాత్రి సమయాల్లో ఏదేచ్ఛగా అక్రమ రవాణాకు ఉపయోగం


పొద్దస్తమానం అక్రమార్కుల ఇల్లు, పొలాల దగ్గర పార్కింగ్

 

జడ్చర్ల నియోజకవర్గంలోని గ్రామాలలో నంబర్ ప్లేట్లు లేని వాహనాలు కోకోల్లలుగా దర్శనమిస్తున్నాయి. అక్రమార్కులు తమ అక్రమ దందాలకు 

వాటిని రాత్రి  సమయాలలో విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారు. రాత్రి వేళల్లో వాటి ద్వారా అక్రమ దందాలు కొనసాగించి ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు వాటిని తమ ఇళ్ళ ముందు, తమ పంట పొలాల దగ్గర నిలిపి ఉంచుతున్నారు. గ్రామాలలో అక్రమార్కుల ఇళ్ల దగ్గర పొలాల దగ్గర అవి నంబర్ ప్లేట్లు లేకుండా దర్శనమిస్తున్న వాటి గురించి సంబంధిత అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. రోడ్లపై వాహనాల తనిఖీ సమయంలో చిన్న,చిన్న వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లు, హెల్మెట్ లు మొదలు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఫిట్నెస్ తదితర రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఏ ఒక్క లోపం కనిపించినా వాటి యజమానులకు భారీగా జరిమానాలు విధించి ముక్కు పిండి వసూలు చేసే సంబంధిత అధికార యంత్రాంగం గ్రామాలలో  పొద్దస్తమానం కోకొల్లలుగా నిలిపి ఉంచుతున్న నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గురించి పట్టించుకోకపోవడం  శోచనీయం. అవి ఏదో చిన్న వాహనాలు అయితే అవి వారి కంటికి కనిపించకపోవచ్చునని అనుకోవడంలో తప్పులేదు. నంబర్ ప్లేట్లు లేకుండా నిలిపి ఉంచుతున్న వాహనాలన్నీ భారీ వాహనాలే. జెసిబిలు, టిప్పర్లు, ట్రాక్టర్లు నంబర్లు లేకుండా పార్కింగ్ చేసి ఉండడం నిత్యం గ్రామాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఫిల్టర్ ఇసుక తయారీ, ఇసుక రవాణా జరుగుతున్న గ్రామాలలో వీటి సంఖ్య పదులలోనే ఉంటుంది. ఆ గ్రామాలలో నిషితంగా పరిశీలించి చూస్తే నంబర్ ప్లేట్లు లేని వాహనాలు పదుల సంఖ్యలో తప్పక దర్శనం ఇస్తాయి. రోడ్ల పక్కన ఇల్లు పంట పొలాలు కలిగి ఉన్న అక్రమార్కులు కూడా ఎలాంటి జంకు బొంకు లేకుండా వాటిని తమ ఇళ్ళ ముందు తమ పంట పొలాల దగ్గర  నిలిపి ఉంచుతుండడం సంబంధిత శాఖ పనితీరును శ్లాగిస్తుంది. ప్రభుత్వం పరిపాలనలో పారదర్శకత కనబరుస్తున్నా సంబంధిత అధికారుల పనితీరు వల్ల దానికి మాయని మచ్చలు ఏర్పడుతున్నాయి. అక్రమార్కులు ఇచ్చే అమ్యామ్యాలకు ఆశపడే ఆ శాఖ అధికారులు కోకోల్లలుగా గ్రామాలలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు నిలిపి 

ఉంచి కనిపిస్తున్నా

 వాటి గురించి పట్టించుకోకపోవడం లేదనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఎవరు ఏ విమర్శలు చేస్తే మాకేంటి మాకు వచ్చే నెలసరి మామూల్లు మాకు వస్తున్నాయి ఎవరు ఏ విధమైన అక్రమాలు చేస్తే  మాకెందుకు అన్న చందంగా సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నట్లు 

ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ప్రజాప్రతినిధుల అండదండలతో తమ అక్రమ దందాలను కొనసాగిస్తుండడం ప్రభుత్వ పాలనను ప్రజలు శంకించేలా చేస్తుంది. ఈ అక్రమ దందాలను జరిపే అక్రమార్కులు తమ దందాల కొనసాగింపు కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారు. ఎవరైనా అక్రమ దందాలను గురించి ప్రశ్నిస్తే వాడి ముఖాన ఒకటో రెండు పచ్చ నోట్లు కొట్టి వారి బారి నుండి బయట పడడం, అంతకు కూడా వారు వెనక్కు తగ్గకపోతే తమ అనుచర గణాన్ని పోగు చేసుకుని వారిని భయభ్రాంతులకు  చేస్తుండడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. ముఖ్యంగా ఇసుక  అక్రమార్కులు, మైనింగ్ మాఫియా, అక్రమ కట్టెల వ్యాపారులు ఈ విధమైన బెదిరింపులకు పాల్పడుతూ తమ దందాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నా కూడా వారి గురించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం సంబంధిత శాఖ అధికారులు,సిబ్బంది పనితీరును గర్హిస్తుంది. తమ వ్యక్తిగత స్వార్థాలు ప్రయోజనాల కోసం వారు ఇలాంటి దురాగతాలను చూసి చూడనట్లుగా వదిలి వేస్తుండడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేకుండా రాత్రి సమయాలలో అక్రమ రవాణా కోసం అత్యంత వేగంగా నడుపుతున్న వాహనాల ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగినా, అవి పట్టుబడిన గుర్తు తెలియని వాహనాలుగా రికార్డు అవుతాయే తప్ప, వాటి డ్రైవర్లు యజమానులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం లేదు. అందుకే ఇలాంటి జిమ్మిక్కులకు అక్రమార్కులు పాల్పడుతున్నారని, అందువల్ల గ్రామాలలో సంబంధిత శాఖల అధికారులు   మూకుమ్మడిగా, ముమ్మరంగా తనిఖీలు చేసి నంబర్ ప్లేట్లు లేకుండా దొరికిన వాహనాలన్నింటినీ సీజ్ చేస్తే అక్రమ దందాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత శాఖ అధికారులు ఏమేరకు స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. వారు ఇందుకు స్పందించి ముమ్మరంగా మూకుమ్మడిగా తనిఖీలు నిర్వహించి నంబర్ ప్లేట్లు లేని వాహనాలన్నింటినీ సీజ్ చేసి తమ నిజాయితీని నిరూపించుకుని అక్రమ దందాలకు పులిస్టాప్ పెట్టేలా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చర్యలు తీసుకుంటారని నియోజకవర్గ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال