మీ కోసం నిలబడతా.. ప్రభుత్వంతోనైనా కలబడతా..

ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచాల్సిందే

* పరిహారం పెంచడానికి డబ్బు లేదంటే ఒప్పుకోను

కాంట్రాక్టర్లకు వందల కోట్లు పెంచినప్పుడు రైతులకు ఎందుకు పెంచరు

నిర్వాసితులతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి




జడ్చర్ల, సెప్టెంబర్ 13:తాను ఎప్పుడూ ప్రజలకు అండగా నిలడతానని, అధికార పక్షానికి చెందిన శాసనసభ్యుడినైనా అవసరమైతే ప్రజల కోసం ప్రభుత్వంపై తిరగడతానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. పాలమూరు ప్రాజెక్టులో భాగమైన ఉదండాపూర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఇచ్చే పరిహారం పెంచకపోతే ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్సష్టం చేసారు. ప్రాజెక్టులు కట్టే కాంట్రాక్టర్లకు నష్టమొస్తుందంటే వందల కోట్ల రుపాయలను పెంచే ప్రభుత్వం రైతులకు ఇచ్చే పరిహారాన్ని మాత్రం ఎందుకు పెంచదని ప్రశ్నించారు.

జడ్చర్ల మండలంలోని దేవునిగుట్ట తాండా సమీపంలో ఉదండాపూర్ భూనిర్వాసిత రైతులు, గ్రామస్తులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, ఉదండాపూర్ భూ నిర్వాసితుల సమస్య, వారికి పునరావాస సహాయం పెంచాలనే విషయంగా తాను ఎమ్మెల్యే కాకముందు నుంచీ పోరాడుతున్నానని, ఎమ్మెల్యే అయ్యాక అసెంబ్లీలో కూడా మొదట ఈ సమస్య గురించే మాట్లాడానని గుర్తు చేసారు. ఆర్ 1డ్ ఆర్ ప్యాకేజీ కింద 2016 లో ఎకరానికి రూ.6.50 లక్షల రుపాయల పరిహారాన్ని ప్రకటించారని, ఇప్పుడు కూడా అదే మొత్తాన్ని రైతులకు పరిహారంగా ఇస్తామనడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నించారు. అప్పుడు ఈ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయి; ఇప్పుడు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పాలమూరు ప్రాజెక్టుకు గుండె వంటిదని  ఇది పూర్తయి కుడి, ఎడమ కాల్వలకు నీళ్లు అందిస్తేనే 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని వివరించారు. అంతటి ఫ్రాధాన్యత కలిగిన ఉదండాపూర్ భూ నిర్వాసితుల పునరావాసం గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. పాలమూరు ప్రాజెక్టులో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది ఉదండాపూర్, వల్లూరు గ్రామస్తులేనను చెప్పారు. ఇప్పటికే ఈ విషయం గురించి నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లానని భూ నిర్వాసితులు ఇచ్చే పరిహారాన్ని పెంచే విషయం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు సామర్థ్యాన్ని ఒక టీఎంసీ పెంచి, ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.30 వేల కోట్లు పెంచుకుందని, ఆ సమయంలోనే ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యను పట్టించుకొని ఉంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారమైయ్యేదని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంపునకు సంబంధించిన ఫైలు విషయంగా తానే స్వయంగా ఫాలో అప్ చేస్తున్నానని తెలిపారు. పరిహారం మొత్తాన్ని పెంచడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదంటే తాను ఒప్పుకొనేది లేదని స్పష్టం చేసారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చే పరిహారం పెంచాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తాను ఉదండాపూర్, వల్లూరుతో పాటు మిగిలిన 7 తాండాలకు చెందిన గ్రామస్తుల పక్షాన నిలబడిపోరాడుతానన్నారు. తాను అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనైనా ఈ విషయంలో అవసరమైతే ప్రభుత్వంపై తిరగబడటానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. డీజిల్ ధరలు పెరిగాయని కాంట్రాక్టర్లు చెప్తే వారికి వందల కోట్ల రుపాయలు పెంచి ఇచ్చే ప్రభుత్వం, రైతులకు నష్టం కలుగుతోందంటే వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచడానికి మాత్రం ఎందుకు ముందుకురాదని అనిరుధ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగానే కొందరు నిర్వాసితులు లేవనెత్తిన సమస్యలను ప్రస్తావిస్తూ, ముంపు గ్రామాలకు అధికారులతో కలిసి తానే స్వయంగా వస్తానని, ఒక్క రోజులో కాకపోతే రెండు రోజులైనా ఆ గ్రామాల్లో తిరిగి మళ్లీ రీ సర్వే చేయించి జరిగిన తప్పులను సరిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో రీ సర్వే జరగాల్సిందే, ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాల్సిందేనని అనిరుధ్ రెడ్డి పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించిన తొలి పర్యటన ఈనెల 20 న ఉంటుందని ప్రకటించారు. పునరావాసం పెంపునకు సంబంధించిన ఫైలు పరిశీలనలో ఉందని, దానిపై వారం, పది రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారని ప్రస్తావించారు. అయితే 6 నెలలు వేచి చూద్దామని, ఈ లోపుగా ప్రాజెక్టు పనులు మొదలుపెడతామని వివరించారు. ఈ విషయంలో నిర్వాపసితులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్వాసితులందరూ సహకరించాలని అనిరుధ్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ ముకుందరెడ్డి, అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు , ఇరిగేషన్ ఎస్ఇ శ్రీనివాస్, జడ్చర్ల తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొని ప్రసంగించారు.


Previous Post Next Post

نموذج الاتصال