ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు
భక్తులతో కిటకిటలాడిన దేవాలయ ప్రాంగణం
జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట డాగ్ బంగ్లా (ఐబి) సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత బోనాల పండుగను కావేరమ్మపేట, జడ్చర్ల ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు చాటేలా ఆడపడుచులు పట్టు చీరలను ధరించి పసుపు, కుంకుమ, వేపాకు మండలతో అలంకరించిన కొత్త బోనం కుండలను తలపై పెట్టుకుని పోతురాజుల విన్యాసాలతో, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో, యువత డిజే నృత్యాలతో ఊరేగింపుగా శ్రీ బంగారు మైసమ్మ దేవాలయానికి చేరుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షణ చేసి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి, మొక్కలను తీర్చుకున్నారు. పట్టణ ప్రజలను చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. బోనాల ఉత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కావేరమ్మపేట శ్రీ బంగారు మైసమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, బంగారు మైసమ్మ దీవెనతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, బిఆర్ఎస్ నాయకులు చించోడ్ అభిమన్యు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం, కౌన్సిలర్లు బుక్క మహేష్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, నందకిషోర్ గౌడ్, శశికిరణ్, కుమ్మరి రాజు, బిఆర్ఎస్ నాయకులు రామ్మోహన్, కృష్ణారెడ్డి (బీకేఆర్), లింగం, దేవాలయ కమిటీ సభ్యులు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
