అల్లుడు బిడ్డ వస్తే ఏడ ఉండాలే..!?
ఏడు వేల మందితో షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపును ముట్టడిస్తాం
ఇప్పటికైనా డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇస్తారా లేదా..?
డబుల్ బెడ్ రూం ఇళ్లు వ్యభిచారం, గంజాయి ముఠాలు, పేకాటలకు ఆనవాళ్లు
ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగితే అధికారులదే బాధ్యత
ఇండ్లన్నీ "పడావు" పడుతున్నాయి
రాజకీయాలకతీతంగా పార్టీలు ప్రజా సంఘాలతో ఉద్యమం ఉధృతం
షాద్ నగర్ బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్
ఇండ్లు ఇచ్చేదాకా పాలకులను నిద్రపోనివ్వను
'అల్లుడు, బిడ్డా వస్తే ఏడ పండుకోవాలే... ఊళ్లల్లో ప్రతి కుటుంబానికి పాడిపశువుంటది.. దాన్ని ఎక్కడ కట్టేయాలే.. ఇవన్నీ మా అధినేత కేసిఆర్ చెప్పిన మాటలే ఆ మాటలకు నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం ఎవరిని విమర్శలు చేసినా ఇప్పుడు కూడా మేము ప్రశ్నిస్తున్నది ఇదేనని కట్టించిన ఇండ్లను పేద ప్రజలకు పంపిణీ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడంలేదని షాద్ నగర్ బీఆర్యస్ యువనేత తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ ప్రశ్నించారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజావరప్రసాద్ మాట్లాడారు.
గతంలో మీడియా ప్రకటనలో తాను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ నిమిత్తం ఈ నెల 6న ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించిన నేపథ్యంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సంఘాలు ఆయా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అందరితో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశం అనంతరం రిలే నిరాహార దీక్షలు చేపడతానని అల్టిమేటటం జారీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించే క్రమంలో ఆనాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవాకులు చవాకులు పేలిందని ఇప్పుడు తాము ఇళ్లను కట్టి ఇచ్చామని కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు మంచినీటి సౌకర్యం విద్యుత్తు సమకూర్చామని రంగులు కూడా వేశామని మరి ఎందుకు ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పేదలకు ఇండ్లను పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఎంపికైన లబ్ధిదారులపై ఏవైనా అనుమానాలు ఉంటే మళ్లీ వాటిని పున సమీక్షించాలని, అదేవిధంగా లోటుపాట్లు కనిపించి అనర్హులు ఎవరైనా జాబితాలో ఉంటే వారిని వెంటనే తీసివేసి అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని రాజవరప్రసాద్ డిమాండ్ చేశారు. ఎంపిక చేసిన జాబితాలో అర్హులు ఎవరైనా ఉంటే వాటికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కేటాయింపులో జోక్యం చేసుకోలేదని చెప్పారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దాదాపు 1600 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి సుమారు 8 మంది లబ్ధిదారులకు ఇచ్చి జాబితాను ప్రకటించామని తెలిపారు. అయితే ఆ జాబితా ప్రకారం అర్హులకు ఇళ్లను కేటాయించవచ్చని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా అద్దె ఇళ్లలో అత్యధిక డబ్బులు వెచ్చిస్తున్నారని అద్దెలు కట్టలేకపోతున్నారని సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలకు వెంటనే బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తే 1600 కుటుంబాలు బాగుపడతాయని సూచించారు. ఇండ్లను ఇవ్వకపోతే 7000 మందితో ఎమ్మెల్యే క్యాంపు కేరాలయాన్ని ముట్టడిస్తే ఎలా ఉంటుందో? ఒక్కసారి ఊహించుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు సవాల్ విసిరారు. 1600 మంది లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు కూర్చుంటే ఏమవుతుందో బేరీజు వేసుకోవాలని రాజావరప్రసాద్ హెచ్చరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట వేలకోట్ల కుంభకోణం చేసిన నాయకులు ఉన్నారని అందులో ఓ మంత్రి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారని కానీ గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు లేకుండా చూసామని అన్నారు. ఎమ్మెల్యే పదవులు శాశ్వతం కాదని మా అంజయ్య తర్వాత శంకరయ్య వచ్చారని ఎవరికి ఈ పదవులు శాశ్వతం కాదని అధికారులు మాత్రం ఎన్నో ఏళ్లుగా సర్వీసులో ఉంటారని వారు పొరపాటు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం పై ఉంటుందని అన్నారు. గత పది ఏళ్లలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి 1700 ఇళ్లను కడితే వాటిని పంచడానికి పాలకులకు ఎందుకు బరువెక్కిందని అన్నారు. తాము ఎంపిక చేసిన జాబితా కాదనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొని ప్రత్యామ్నాయంగా ఇళ్లను ఇస్తారో వెంటనే పత్రిక ముఖంగా ప్రకటించాలని లేకపోతే ఏం పీకుతున్నారో ప్రజలకు బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
జాబితా సిద్ధమై అధికారులు లబ్ధిదారులకు రెండుసార్లు ఫోన్లు కూడా చేశారని అదే అధికారులు ఇంకా ఇక్కడ ఉన్నారని అయినా కూడా ఇళ్లను ఇవ్వకుండా పడావు పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వ్యభిచారం గంజాయి ముఠాలు పేకాటలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయని రాజా వరప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. అడ్డమైన దందాలకు ఆనవాళ్లుగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చలామణిలోకి తీసుకురావాలని రాజ వరప్రసాద్ వాదించారు. ఇళ్లను పంపిణీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటానని, ఇళ్లను ఇచ్చేవరకు పాలకులను వదలబోనని హెచ్చరించారు. దందాలు చేసి అధికారంలోకి రాలేదని చౌరస్తాలో ఉద్యమాలు చేసి వచ్చామని మళ్లీ చౌరస్తా నుండి ఉద్యమాలు మొదలుపెడతామని రాజా వరప్రసాద్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
కేటీఆర్ ప్రారంభించి ఎందుకు ఇవ్వలేదు..?
మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ కు ముందే కేవలం 8 మందికి ఇళ్లను కేటాయించి మిగతా వారికి అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వలేదని మీడియా ప్రశ్నించగా రాజవరప్రసాద్ సమాధానం చెప్పారు. అలా ఇవ్వలేదు కాబట్టే మేము ఓడిపోయామంటూ వాస్తవాన్ని ఒప్పుకున్నారు. అందుకే ప్రజలు మమ్మల్ని శిక్షించారని ఇప్పుడు ఆ గతి కాంగ్రెస్ కు పట్టొద్దని, ప్రజలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇచ్చేయాలని రాజవరప్రసాద్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన కుంభకోణంపై సమాధానం చెబుతూ గత పది ఏళ్లలో కూడా పంపిణీలో అవకతవకలు జరిగాయని పాలమూరులో కూడా ఓ మాజీ ప్రజా ప్రతినిధి మనుషులు కూడా అవకతవకలు సృష్టించారు కదా అని ప్రశ్నిస్తే రాజవరప్రసాద్ సమాధానం చెప్పలేకపోయారు. తాము రాజకీయ కక్షలు తీర్చుకోలేదని తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన పార్టీ అని రాజవరప్రసాద్ చెప్పుకొచ్చారు..
