జైల్లోనే డబుల్‌ ఇల్లు కట్టిస్తా.. ఏదంటే అది మాట్లాడితే ఊరుకోం ! కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక

 జైల్లోనే డబుల్‌ ఇల్లు కట్టిస్తా.. ఏదంటే అది మాట్లాడితే ఊరుకోం



కేసీఆర్‌.. మా కార్యకర్తలు తలచుకుంటే నీ డ్రాయర్‌ కూడా మిగలదు

గతంలో మా ప్రభుత్వంలో 25 లక్షల ఇళ్లు.. మీరు ఎన్ని కట్టారు?

గుజరాత్‌ మోడల్‌పై వైబ్రెంట్‌ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తుంది

నమో అంటే నమ్మించి మోసం.. ఉత్తరాది, దక్షిణాది చిచ్చుకు కుట్ర

మా పాలన నచ్చితే 14 సీట్లివ్వండి.. తుక్కుగూడ సభలో రేవంత్‌రెడ్డి

చర్లపల్లి జైల్లోనే డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తా

కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 ముఖ్మమంత్రి రేవంత్‌రెడ్డి.. తుక్కుగూడ జనజాతర సభ వేదికగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోనని, చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని అన్నారు. అధికారంపోయింది, కాలు విరిగింది.. కూతురు జైలుకు వెళ్లిందని మానవత్వంతో ఇన్నాళ్లూ మర్యాదపూర్వకంగా వ్యవహరించామని తెలిపారు. ‘‘మమ్మల్ని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. నేను పెద్దలు జానారెడ్డిలా కాదు. నేను రేవంత్‌రెడ్డిని బిడ్డా! నువ్వు మాట్లాడే లత్కోరు, లఫంగి మాటలకు.. అంగీ, లాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డా! కొడుకు, బిడ్డతో కలిసి ఉండేందుకు చర్లపల్లి జైల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కట్టిస్తా’’ అంటూ రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లా, అడవి పందుల్లా పట్టి పీడించారని, పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు. తాము వెంట్రుక కూడా పీకలేమని కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ కార్యకర్తలు తలచుకుంటే ఆయన ము.. మీద డ్రాయర్‌ కూడా ఉండదని అన్నారు. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిందని, గడిచిన పదేళ్లలో కేసీఆర్‌ ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించారో చెప్పాలని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లలో తాము ఓట్లు అడుగుతామని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఉన్న ఊళ్లలో కేసీఆర్‌ ఓట్లు అడగాలని సవాల్‌ విసిరారు.

మా పాలన నచ్చితే 14 సీట్లు ఇవ్వండి..

తాను, తన మంత్రివర్గం వంద రోజుల పాలనను ప్రజల ముందు పెట్టామని, ఈ వంద రోజుల్లో తాము మంచి పాలన అందించామని భావిస్తే 14 సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఒకవేళ తమ పాలన సరిగా లేదని భావిస్తే.. తమకు ఓటేయాలో వద్దో ఆలోచన చేసుకోవాలన్నారు. తాము నిజాయితీగా, కడుపు కట్టుకుని రోజుకు 18 గంటలు కష్టపడి ఆరు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు. భవిష్యత్తులో మంచి పాలన అందించేందుకు ఢిల్లీ నుంచి నిధులు, అనుమతులు తెచ్చుకోవాల్సి ఉందని, అందుకోసం 14 సీట్లు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన సోనియాగాంధీ బిడ్డ రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకోవడానికి 14 సీట్లు ఇవ్వాలన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్‌ నుంచి ముంబయికి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్‌గాంధీ ప్రధాని కావాలా? లేక హెలికాప్టర్‌లో తిరుగుతూ, విదేశీ పర్యటనలు చేస్తూ, గంట గంటకూ డ్రెస్సులు మార్చుకుంటూ.. చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాన్ని వంచిస్తున్న మోదీ ప్రధాని కావాలా? అని ప్రశ్నించారు. దీనిపై యువత ఆలోచన చేయాలన్నారు. ఏ తుక్కుగూడ గడ్డపైనైతే సోనియాగాంధీ తెలంగాణకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి మూడు రంగుల జెండాను రెపరెపలాడించారో.. అదే గడ్డపైనుంచి రాహుల్‌గాంధీ ఐదు గ్యారెంటీలను జాతికి అంకితం చేశారని రేవంత్‌ పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తల పునాదులు బలంగా ఉండాలని, రాష్ట్రం నలుమూలలా లక్షలాది మంది కార్యకర్తలు సైనికులై కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుందని అన్నారు. కార్యకర్తల శ్రమ, త్యాగంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. గుజరాత్‌ మోడల్‌పై వైబ్రెంట్‌ తెలగాణ ఆధిపత్యం చూపించి దేశాన్ని అభివృద్ధి పథం వైపునకు నడిపిస్తుందని చెప్పారు.

ఎంపీ అభ్యర్థులు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ అభ్యర్థితో రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow