త్రేతాయుగంలో శ్రీరాముడే ప్రతిష్ఠించిన శివలింగం..!
ప్రతి ఏటా పెరుగుతున్న శివలింగం మహాత్యం
శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు
రామేశ్వరంలో ఘనంగా శివరాత్రికి ఏర్పాట్లు
షాద్ నగర్ బస్సు డిపో నుండి ప్రత్యేక బస్సులు
షాద్‌నగర్: ప్రపంచంలో ఎన్నో విశేషాలు, వింతలు, అద్భుతాలు ఇమిడి ఉన్నాయి. ఎక్కడ ఏ మహత్తు దాగి ఉందో ఎవరికి తెలియదు. మహా శివుడి ప్రతిరూపమైన ఒక లింగం మాత్రం ఈ ప్రాంతంలో అద్భుతమైన మహాత్తులు కలిగి భక్తులకు దర్శనం ఇస్తున్న తీరు నా భూతో నా భవిష్యత్.. తెలంగాణలోని షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రం సమీపంలోని ఫరూక్ నగర్ మండలం రాయికల్ గ్రామ సమీపంలో ఉన్న శివాలయంలోని లింగాన్ని త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినట్టు చరిత్రలో ఉంది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ శివారులోని పంచముఖ గుట్టపై వెలిసిన రామలింగేశ్వరుడిని స్వయంగా శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడని చరిత్ర కారులు, పురాణ పుంగవులు అంటారు. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్టు మాణిక్య ప్రభు చరిత్రలో పేర్కొన్నారు. అంతేకాదు, లింగాన్ని సాక్షాత్తు శ్రీ రామచంద్రుడే ప్రతిష్ఠించాడనడానికి నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తు ఉంటుంది. లంకాధిపతి రావణాసురని సంహరించి సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బదిరీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసారని భక్తుల విశ్వాసం. ప్రకృతి వైపరీత్యాల వల్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనేక వందల ఏళ్లు భూగర్భంలోనే ఉండిపోయినట్టు చరిత్ర చెబుతుంది. రామేశ్వరం గుట్టల మధ్య మాణిక్య ప్రభువు శిష్యుడైన నరసింహారాయులు తపస్సు చేస్తుండుగా ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శన మిచ్చాడు. బదిరీ వృక్షం కింద శివలింగం ఉందనీ, దాన్ని బయటకు తీసి పూజలు నిర్వహించాలని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు. దీంతో ఆయన శివలింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాడు. అనంతరం నరసింహారాయల శిష్యుడు అప్పకొండ భట్టు దత్తాత్రేయ స్వామి ఆలయం, కోనేరును నిర్మించి రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి చేసినట్టు చెబుతారు. ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్లు ఏర్పడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. శివరాత్రి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలను ఇక్కడే విరమిస్తారు. ఈ ఆలయం షాద్‌నగర్ ఎన్‌హెచ్ 44 నుంచి రాయకల్ గ్రామం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాయికల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరానికి 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. షాద్ నగర్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది.
శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని. లింగం అంటే ఆకారం అని అర్థం.శివ లింగం అంటే శివుని ఆకారం అని అర్ధం, పురుషలింగం/స్త్రీ లింగం అంటే పురుష ఆకారం,స్త్రీ ఆకారం అని అర్ధం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది,నిరాకారమైన దైవానికి రూపం లేదు, సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపం. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోంది.
పురాణాల్లో లింగోద్బవం
మహా శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమ శివుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. అలాగే మహాశివరాత్రి రోజు లింగద్భవ సమయంలో చాలామంది భక్తులు రామేశ్వరం దేవాలయంలో ఇక్కడ ప్రత్యేక దర్శనం కోసం పడిగాపులు కాస్తుంటారు. ఆసలు లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. మహా ప్రళయం తరువాత, సృష్టి, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి, అది సంగ్రామానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు భీకర ఆస్త్రాలను ప్రయోగించుకునే వేళ, మరో ప్రళయాన్ని నివారించేందుకు లయ కారకుడు రంగంలోకి దిగి, ఆద్యంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్థరాత్రి. ఇదే లింగోద్భవ కాలం. ఇక ఈ శివ లింగావతారం మొదలును తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో, ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లి, తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడినే శరణు కోరగా, తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే, రాత్రి 11 గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతుంటారు. అందుకే మహాశివరాత్రి రోజు ఈ సమయంలో ఆలయం కిక్కిరిసి ఉంటుంది.
రామేశ్వరం బ్రహ్మోత్సవాలు..
శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వరంలో ఈనెల 4వ తారీఖు నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈనెల 11 సోమవారం వరకు బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా దేవదాయశాఖ నిర్వహిస్తుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ ఎం రవీందర్ రావు వంశపారపర్య అర్చకులు ప్రహ్లాదాచార్యులు కార్యనిర్వహణాధికారి శివకుమార్ సంయుక్తంగా మీడియాకు తెలిపారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయన సతీమణి అనురాధ దంపతులు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అధికారికంగా జరిపించారు.
ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు 516 రూపాయలు చెల్లించి స్వామివారి కల్యాణోత్సవం లో పాల్గొనవచ్చు. భక్తులు ఇచ్చే కానుకలు వస్తువులకు దేవదాయ శాఖ రసీదులు ఇస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు స్పర్శ దర్శనం ఉంటుంది అభిషేకాలు మాత్రం ఉండవు. షాద్ నగర్ బస్ డిపో నుండి ప్రత్యేక బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రత్యేక వాహనాల్లో భక్తులు శివరాత్రికి ఇక్కడికి దర్శనం కోసం వస్తుంటారు..