తెలంగాణలో మహిళల ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు! రూల్స్ ఇవే!

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్యలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆ వివరాలు



తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక బాధ్యతలు స్వీకరించగానే.. రేవంత్ రెడ్డి ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేయనున్నట్లు సమాచారం. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు మూడు రకాల పథకాలు కేటాయించారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంతో పాటు 500 రూపాలయకు గ్యాస్ సిలిండర్.. అలానే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు మొదలు పెట్టినట్లు సమాచారం...


ఉచిత ప్రయాణం కింద.. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందనే విషయానికి సంబంధించి అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం అమలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పథకం కోసం అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది.. అన్న విషయాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తోంది.


బెంగళూరు వెళ్లే అధికారుల బృందం రెండు రోజుల పాటు అక్కడ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని పరిశీలించి.. నివేదికను సిద్ధం చేయనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ఖరారు చేసిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దీంతో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.



ఎక్స్‌ప్రెస్‌ సర్విసుల్లో కూడా అమలు చేస్తే..

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. అయితే అన్ని సర్వీసుల్లో అనగా ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ, గ్రామీణ రూట్లలో దీన్ని అనుమతించలేదు. కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. కేవలం ఈ పింక్ బస్సులోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది.


కర్ణాటకలో ఇలా..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం గురించి హామీ ఇవ్వడమే కాక అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకువచ్చింది. ఇక తమిళనాడులో నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండగ.. కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని ప్రకటించడమే కాక.. దాన్ని అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో దీనిపై హామీ ఇచ్చింది.



మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి కర్ణాటక మోడల్‌ను అనుసరిస్తుందా.. తమిళనాడు మోడల్‌ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి రూ.2200 కోట్లు ఖర్చు అవుతుంది. పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ప్రభుత్వంపై భారం ఇది..

మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే, ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్‌ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్ల వరకు రీయింబర్స్‌ చేయాలి. అంటే ప్రతి నెలా ప్రభుత్వం ఆర్టీసీకి రూ.185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.


ఇక్కడ కూడా జీరో టికెట్ తెస్తారా..

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించేందుకు గాను.. ప్రస్తుతం కర్ణాటకలో జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా.. ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు అన్న అంశాన్ని ఈ జీరో టికెట్ ద్వారా లెక్కిస్తారు. దీనిలో భాగంగా మహిళలకు రూ.సున్నా అని ఉండే జీరో టికెట్‌ను జారీ చేస్తారు.



అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. ఇక్కడ అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా త్వరలోనే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ కానున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow