🟥 తెలంగాణలో సంచలన నిర్ణయం
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్
జీతంలో 15% కోత… నేరుగా పేరెంట్స్ ఖాతాలో జమ
హైదరాబాద్:
తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ అనే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఈ కొత్త చట్టం ప్రకారం తల్లిదండ్రులను చూసుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో నుంచి 15 శాతం కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
🟦 వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా
ఇటీవలి కాలంలో చాలా మంది పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వేరుగా నివసించడం లేదా వృద్ధాశ్రమాల్లో చేర్పించడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
🟨 సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
ఈ బిల్లు ఆమోదం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…
పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ఖర్చు చేస్తారని, కానీ కొంతమంది పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తున్నారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో వృద్ధులకు భరోసా కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఇది గుణపాఠం లాంటిదని, అలాంటి వారిని సమాజం కూడా ప్రశ్నించాలని సీఎం పిలుపునిచ్చారు.
