Akshara Concept High School**లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు వినూత్న శాస్త్రీయ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. “My World in 2050” అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భవిష్యత్ ప్రపంచాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన భారీ పెయింటింగ్‌లో స్మార్ట్ సిటీలు, డ్రోన్లు, అంతరిక్ష ప్రయోగాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను విద్యార్థులు సృజనాత్మకంగా చిత్రించారు.
అంతేకాకుండా ISRO ఆధ్వర్యంలో విజయవంతమైన Chandrayaan-3 నమూనాను విద్యార్థులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. రాకెట్ నిర్మాణం, ప్రయోగ విధానం గురించి వివరించారు.
“న్యూ ఎరా సైంటిస్ట్” అనే ప్రత్యేక స్టాల్‌లో సూర్యుడి నమూనా, గాలి, అగ్ని వంటి సహజ శక్తుల ప్రాధాన్యతను వివరించారు. అలాగే నీటి శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి, హైడ్రోపోనిక్స్ విధానం, కార్బన్ ఎమిషన్ తగ్గింపు వంటి ప్రయోగాలను చూపించారు.
జీవశాస్త్ర విభాగంలో గర్భంలోని శిశువు అభివృద్ధి దశలను అద్భుతంగా ప్రతిబింబిస్తూ విద్యార్థినులు తయారు చేసిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. భౌతిక, రసాయన శాస్త్ర విభాగాల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.
పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు, ఆహ్వానితులు ప్రశంసించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.