కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు వేసిన కాళేశ్వరం కమిషన్ ముందు వింత వింత సంగతులు బయటకొస్తున్నాయి. ఈ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చిన ఈటెల మాటలపై తుమ్మల మండిపడ్డారు.
బీజేపీ నేత, హైదరాబాద్ మల్కాజ్‌గిరి ఎంపి ఈటెల రాజేందర్ మాటల్ని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తప్పుబట్టారు. కాళేశ్వరం కమిషన్‌కు ఈటెల అసత్యాల వాంగ్మూలం ఇచ్చారన్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటెల పొంతనలేని సమాధానం ఇచ్చారని, ఆయన చెప్పిన సబ్ కమిటీ.. కాళేశ్వరం కోసం వేసింది కాదన్నారు. కాళేశ్వరంకు శాంక్షన్ ఇచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టుల కోసం వేసిన సబ్ కమిటీ అదని తుమ్మల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రాణహిత, దేవాదుల, కాంతలపల్లి, తుపాకుల గూడెం పనుల కోసం సబ్ కమిటీ వేశారని మంత్రి తుమ్మల అప్పటి బీఆర్ఎస్ పాలనా సమయంలో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకున్నారు. ఆ సబ్ కమిటీ కాళేశ్వరం బ్యారేజీలపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదని.. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ ఆమోదం తెలిపిందనడం అబద్ధమని మంత్రి చెప్పారు.
కాళేశ్వరం కేబినెట్ ఆమోదం పొందలేదని మంత్రి తుమ్మల తేల్చిచెప్పారు. 'కాళేశ్వరం ఎప్పుడూ కేబినెట్ ముందుకు రాలేదు. పరిపాలన అనుమతులతోనే కాళేశ్వరం అమలులోకి వచ్చింది. ఈటెల రాజేందర్ ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కాళేశ్వరం ముందు ఈటలకు అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఈటెల పట్ల గౌరవం ఉంది. కానీ ఆయన ప్రకటన చూసిన తర్వాత కొంత బాధేసింది. నేను స్వయంగా కమిషన్‌కు సబ్ కమిటీ రిపోర్ట్‌ను ఇవ్వాలి అనుకుంటున్న. కమిషన్ వివాదంలోకి నన్ను ఎందుకు లాగాల్సి వచ్చిందో ఈటెలే చెప్పాలి. తుమ్మల కూడ కాళేశ్వరం కోసం సబ్ కమిటీ రిపోర్ట్ పై సంతకం చేశారని ఇచ్చిన వాగ్మూలం బాధాకరం. కాళేశ్వరం కేబినెట్ ఉమ్మడి నిర్ణయం అని చెప్పడం సరికాదు. హరీష్ రావు అబద్దాల హరీష్ రావుగా మారిపోయారు'. అని ఈటెల అన్నారు. కాళేశ్వరం కేబినెట్ ముందుకు వచ్చినట్లు రుజువు చూపించాలని ఆయన ఈటెలను డిమాండ్ చేశారు. కాగా, తుమ్మల గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే వారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి చేరి ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.